Pawan Kalyan: బలపడి తీరాల్సిందే.. సేనాని భారీ వ్యూహం
తన తొలి దశ వ్యూహాన్ని మార్చుకుంటూ, ప్రస్తుతం ‘మనం బలపడాల్సిందే’ అనే కొత్త పంథాలో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమకు పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమని సేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. అంటేనే తెలుగు రాజకీయాల్లో ఒక అసాధారణ ప్రయాణం. సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి, రాజకీయాల్లో జీరో నుంచి హీరోగా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతిపక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ముఖ్యంగా, 2024 ఎన్నికల్లో చెప్పి మరీ వైసీపీ (YCP)ని అథఃపాతాళానికి తొక్కేసిన విధానం.. ఆయన రాజకీయ చాణక్యాన్ని, ప్రజల్లో ఉన్న బలమైన ప్రభావానికి నిదర్శనం. జీరో నుంచి 100 శాతం స్ట్రైక్ రేటుతో మూడవ అతిపెద్ద పార్టీగా జనసేన (Janasena)ను నిలబెట్టిన పవన్ (Pawan), తన తొలి దశ వ్యూహాన్ని మార్చుకుంటూ, ప్రస్తుతం ‘మనం బలపడాల్సిందే’ అనే కొత్త పంథాలో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమకు పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమని సేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అనుభవం, సమర్థత కలిగిన చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ల పాటు కొనసాగితే ఏపీ దేశంలోనే అగ్రగామిగా మారుతుందని ఆయన విశ్వసించారు. అందుకోసమే వ్యక్తిగత ప్రతిష్టను పక్కన పెట్టి టీడీపీ (TDP)కి మద్దతుగా కూటమిలో చేరారు.
సీఎం అయ్యేదెప్పుడు?
గెలుపు ఓటములను నిర్ణయించే, అధిక జనాభా కలిగిన బలమైన కాపు సామాజిక వర్గం నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా ఆయన ఆలోచనలు మారుతున్నట్లు తెలుస్తోంది. ‘సీఎం పవన్’ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు, ఆ సామాజిక వర్గం నుంచి వస్తున్న ఆవేదన దృష్ట్యా, రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని, ఎప్పటికప్పుడు వ్యూహం మార్చుకోవాల్సిందే అన్న వాస్తవాన్ని జనసేన నాయకత్వం గుర్తించినట్లు కనిపిస్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు జనసేనను పునరాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎపిసోడ్ వంటి సందర్భాలు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పవన్‌ను లక్ష్యంగా చేసుకున్న తీరును జనసేన పెద్దలు నిశితంగా అంచనా వేస్తున్నారు. తాము ఇలాగే ఉంటే మరింత చులకన అవుతామనే భావన జనసేన పెద్దల్లో బలపడుతున్నట్లు సమాచారం. అందుకే, కూటమిలో కావాల్సిన గౌరవం దక్కాలన్నా, తమదైన వాటా తీసుకోవాలన్నా, జనసేన బలపడాల్సిందే అన్న కొత్త నిర్ణయానికి వారు వచ్చారు. ‘ఎన్నికల ధర్మం’ కోసం వెనకడుగు వేసినా, పవన్‌ను పదేపదే కొందరు నేతలు హర్ట్ చేస్తున్న నేపథ్యంలో, కార్యకర్తల ఆవేదనకు తగిన విధంగా పార్టీ బలం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ 2029..
ప్రస్తుతం జనసేన (Janasena) అనుసరిస్తున్న ఈ నయా వ్యూహాన్ని గమనిస్తే.. 2029 ఎన్నికల్లో జనసేన కేవలం ‘పక్క వాయిద్యం’గా మిగిలిపోయే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న మూడేళ్ల కాలంలో అధికారాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుని బలమైన శక్తిగా మారేందుకు పవన్ గట్టి ప్రయత్నం చేయనున్నారు. భవిష్యత్తులో టీడీపీ (TDP), బీజేపీ (BJP)తో కలిసి కూటమిగా పోటీ చేసినా, ఆ పార్టీ సీట్లతో పాటు అధికారంలోనూ అధిక వాటా కోరే అవకాశం ఉంది. సీఎం పీఠాన్ని అందుకునేందుకు అవసరమైన ప్రాతిపదికను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి, ఏపీలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు జనసేనను బాగానే మేలుకొలిపాయని, ఇది ఆ పార్టీకి ఎంతో మేలు చేసే విధంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ దూకుడు, ఆయన ‘జీరో నుంచి హీరో’గా ఎదిగిన సత్తా.. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలను ఎలా మారుస్తుందో చూడాలి.
రాజకీయాల నుంచి తప్పుకుంటా..
సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మత్య్సకారుల సమస్యలు సవాల్‌గా మారాయాన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం (Deputy CM Pawan Kalyan) సంచలన ప్రకటన చేశారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు, తాను రాజకీయాల నుంచి ఏకంగా తప్పుకుంటానని శపథం చేశారు. మత్స్యకారుల సమస్యల మీద తనకు అవగాహన, చిత్తశుద్ధి రెండూ ఉన్నాయని ఆయన గట్టిగా చెప్పుకొచ్చారు. ‘ఎవరో వచ్చి, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తన మీద మిమ్మల్ని ఎగదోస్తున్నారు, వారు మీకోసం ఏమీ చేయరు, నేను మాత్రం చేస్తాను. ఈ సంగతి గుర్తించండి’ అని పవన్ మత్స్యకార సోదరులకు విన్నవించుకున్నారు. ‘మీరు తిడితే పడతాను, దెబ్బ పడితే భుజం కాస్తాను. నేను మీ వాడిని, మీతోటి మత్స్యకారుడిని’ అని పవన్ ఆవేశంగా తమను తాము ప్రజలకు మరింత దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు.
ప్రజావాణి చీదిరాల