Harish Rao: కేటీఆర్, హరీశ్ దూకుడు.. కళ్లెం వేసెదెవరు?
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది

తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. గులాబీ బాస్ కేసీఆర్ (KCR) దిశానిర్దేశంలో పార్టీ కీలక నేతలు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) ఏకతాటిపై దూసుకుపోవడమే. ఒకప్పుడు వారి మధ్య అంతర్గత విభేదాలు, పట్టింపులు ఉన్నాయనే చర్చ ఉన్నా, ప్రస్తుతం వారు చావోరేవో అన్నట్లుగా చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ‘కలిసుంటే కలదు సుఖం’ అన్నట్లుగా, కేసీఆర్ ఆదేశాలతో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య దూకుడు ఒక్కటైంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ (Erravalli Farm House), నందినగర్ నివాసంలో పలుమార్లు అధినేతతో జరిగిన వరుస సమావేశాల తర్వాత, ఇక పంతాలు, పట్టింపులకు పోకుండా ఒక్కటిగా అడుగులు ముందుకేయాలని బావబామ్మర్దులకు కేసీఆర్ గట్టిగా క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేసినా కలిసికట్టుగానే చేస్తున్నారు. ఇటీవల బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ఇరువురూ కలిసి నిర్వహించడం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
టార్గెట్ ఈ రెండే..
అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కేటీఆర్, హరీశ్ రావు ఇప్పుడు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. వీరిద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)తో పాటు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ భవన్‌లో వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తూనే.. మెరుపు పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ‘తగ్గేదే లే’ అని ఎటాక్ స్పీడప్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడంలో భాగంగా, ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. గడిచిన 22 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు, మహిళలు, యువకులు వంటి వివిధ వర్గాలకు ఎంతమేర బాకీ పడిందో లెక్కలతో సహా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
దూకుడు అడ్డుకునేదెవరు?
ఈ బాకీ కార్డు ప్రచారానికి మంచి స్పందన వస్తుండటం, కేటీఆర్, హరీశ్ రావు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచుతుండటం గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఇద్దరు కీలక నేతలు రంగంలోకి దిగడంతో, ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను డివిజన్ల వారీగా నేతలతో భేటీ అవుతూ రచిస్తున్నారు. ఓవరాల్‌గా.. గతంలో ఎన్నడూ లేనంత కోఆర్డినేషన్‌తో ఈ బావబామ్మర్దులు అన్ని కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తుండటంతో, గులాబీ పార్టీ నేతల్లో, కేడర్‌లో నయా జోష్ కనిపిస్తోంది. భవిష్యత్తులోనూ ఇరువురూ ఇలాగే కలిసికట్టుగా ఉండాలని పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. వీరి దూకుడును ఆపగలిగే శక్తి ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌కు ఉందా? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా నడుస్తోంది.
;ప్రజావాణి చీదిరాల